Saturday, 17 August 2013



తెలంగాణ బతుకమ్మ పాట by Sabbani Sharada
తెలంగాణ బాధను, కన్నీళ్ళ గాథను అక్షరబద్ధం చేసిన రచయిత్రి సబ్బని శారద పుస్తకం “ తెలంగాణ బతుకమ్మ పాట” ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ...... బంగారు బతుకమ్మ ఉయ్యాలో .....’ అంటూ వయస్సు , అంతస్తు తారతమ్యాలతో నిమిత్తం లేకుండా ముత్తైదువులు, ఆడపిల్లలంతా అంబరాన్ని అంటే సంబరముతో కలిసి ఆడుకునే తెలంగాణ ట్రేడ్ మార్క్ పండుగ, బతుకమ్మ పండుగ. తెలంగాణ భాషలోని వంపుసొంపైన పదాల మాటలతో ఆమె అల్లిన బతుకమ్మ దీర్ఘ గాన వాహిని వింటే మనసు పులకించి ఆవేశం జలగంగలా ఉప్పొంగుతుంది. తెలంగాణ జిల్లాల వెనుకబాటుతనాన్ని, మూతపడుతున్న ఫ్యాక్టరీలు, రైతుల, నేతన్నల ఆత్మహత్యలు, పనులు లేక చినిగిన విస్తర్లైన కూలీల బతుకులు, ఆకలి చావులు, బీడి మహిళా కార్మికుల వెతలు, మొసలి కన్నీళ్ళు కార్చే పాలకుల వివక్షతను ఆమె తూర్పారబడుతూ చిత్రీకరించిన తీరు అద్భుతంగా కనిపిస్తుంది. తెలంగాణ కన్నీటి కడలిగా మారడానికి గల కారణాలను ఈ పాటలో ఏకరువు పెట్టిన తీరు హృద్యంగా ‘రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో తల్లడిల్లుతుంది ఉయ్యాలో తల్లి తెలంగాణ ఉయ్యాలో ఆర్తితో బతుకులు ఉయ్యాలో ఆగమయ్యె సూడు ఉయ్యాలో గాంధీలాగ మీరు ఉయ్యాలో గమ్యాన్ని చేరాలె ఉయ్యాలో అంబేత్కరుని ఉయ్యాలో ఆశయాల మేర ఉయ్యాలో మంచికోరి మనం ఉయ్యాలో మనుగడ సాగిద్దాం ఉయ్యాలో కష్టాల కడలి ఉయ్యాలో కన్నీటి కావ్యం ఉయ్యాలో .....’ తెలంగాణ బతుకులు మెరుగు పడాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనే దిక్కని బల్లగుద్ది చెప్పింది రచయిత్రి. తెలంగాణ బతుకమ్మలు కొనసాగినంత కాలం ఈ తెలంగాణ బతుకమ్మ పాట జవజీవాలతో వర్ధిల్లుతుంది, అంతటి పరిపుష్టి , తెలంగాణ నిండుతనం ఇందులో ఇమిడి ఉంది.

No comments:

Post a Comment